Thursday 1 March 2012

MY NEWLY PUBLISHED KAVITAS




భూమిక స్త్రీవాద పత్రిక  జూలై 2011 
Posted By  on July 7, 2011

అమ్మా! నీ వొక బొమ్మవా?
రాణి పులోమజదేవి
అన్న అమెరికా చదువు కోసం నీ ప్రతిభను పరిషత్‌ బడికి పరిమితం చేస్తే
చాకలిపద్దులు చదవనూ మహారాజరాజశ్రీ శ్రీవారి పాదపద్మములకు నమస్కరిస్తూ లేఖాంశములు వ్రాయనూ వచ్చిందిగా అంటూ
అసంతృప్తిని ఆనందపు టూర్పుగా మలచగలిగావే!
ఎందుకమ్మా! నీ వొక బొమ్మవా?
పుట్టింటికి రాబోయే లక్షల సాయం కోసం
ముందు భార్యను మర్డర్‌ చేసిన మగాడికి
రెండో భార్యగా రగిలే గుండెను వెచ్చని కన్నీళ్ళతోనే చల్లార్చి
రాగాలొలకబోస్తూ వెళ్లావే!
ఏమ్మా! నీ వొక బొమ్మవా?
నాకేం? నే మగాడిని నా కెన్ని ఇండ్లైనా ఉండొచ్చని
మీ ఆయన గర్వంగా మీసం మెలేస్తే
ఆక్రోశించే గుండెను అడకత్తెరలో వేస్తూ
ముసిముసినవ్వులు చిందావే?
ఔనామ్మా? నీ వొక బొమ్మవా?
ఆడపిల్లను కన్నావని ఛీత్కారాలు
మగబిడ్డను కన్నావని నజరానాలూ
ఆడదాని వయ్యుండీ మౌనంగా అందుకున్నావే?
చెప్పమ్మా! నీ వొక బొమ్మవా?
సంపాదించేంత వరకే సమానత్వం అంటూ
నీ నెలజీతాన్ని అకౌంటెంట్‌ టేబుల్‌ మీది నుంచే
తన జేబులో వేసుకునే నీ భర్త సంపాదనను
నీవూ అలా హాండ్‌ బాగ్‌లో వేసుకోలేక
”ఏమండీ! పాస్‌ కొనాలి డబ్బివ్వరూ”
అంటూ ప్రాధేయ పడతావే!
ఏంటమ్మా! నీ వొక బొమ్మవా?
ఆఫీస్‌లో అరవచాకిరీ చేసి అయిదింటికి నీవు
పడుతూ లేస్తూ ఇంటికి వచ్చి
‘ఏంటా ఏడుపు మొహం’ అంటాడని అనూ
ఎమ్‌టివి చూస్తూ ఆరాంగా ఆపసోపాలు పడుతూ
కూర్చున్న ఇంటాయనకు
నవ్వులు పులుముకొని టీ టిఫిన్లు అందిస్తావే!
ఇదేంటమ్మా! నీ వొక బొమ్మవా?
”ఏం ఆడవాళ్ళయితే మాతో సమానంగా జీతాలు తీసుకోవడం లేదా?”
అనే అక్కసుబోతులను
”మీలా టీలు సిగరెట్లూ అంటూ నేను
గంటల తరబడి సీటు వదిలి సరదా చేస్తున్నానా?”
అని నిలదీయక
ప్రకృతి ధర్మంగా స్త్రీ కొచ్చే అన్ని ఇబ్బందులనూ
పావుగంటైనా పర్మిషన్‌ తీసుకోకుండా
పంటిబిగువున భరిస్తావేమ్మా! నీవొక బొమ్మవా?
రెండలైట్‌ వీధిలోనైనా, వైట్‌ హౌస్‌ పరిధిలో ఉన్నా
నిన్ను అవసరానికి వాడుకున్న మగాడు
ఆడదాని చొరవే అనార్థలకు హేతువని
ఉవాచలు విసురుతుంటే
అసహాయంగా కన్నీళ్లు కారుస్తావే తప్ప
అమ్మగా అందమైన ఆడబొమ్మగా కూడా
నేనేనోయ్‌ నీ ఆకలి(ళ్ళు) తీర్చగలిగేదానినని
చనుబాలు కక్కేలా సమాధానం ఇవ్వవేమ్మా!
నీ వొక బొమ్మవా?